ప్రియాంక చోప్రా 'అనామలీ' బ్రాండ్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్ రిటైల్

  • ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ ‘అనామలీ’ని కొనుగోలు చేసిన రిలయన్స్
  • భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరించనున్నట్లు వెల్లడి
  • బ్రాండ్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్న ప్రియాంక చోప్రా
  • ఇది వ్యూహాత్మక అడుగని వ్యాఖ్యానించిన రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ
భారత రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఆర్ఆర్ఎల్), తన బ్యూటీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే దిశగా మరో కీలక ముందడుగు వేసింది. గ్లోబల్ స్టార్, నటి ప్రియాంక చోప్రా జోనస్ స్థాపించిన ప్రముఖ హెయిర్‌కేర్ బ్రాండ్ ‘అనామలీ’ని రిలయన్స్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ‘అనామలీ’ ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్ ఆస్తులు, డిజిటల్ హక్కులను రిలయన్స్ సొంతం చేసుకుంది.

2021లో ప్రియాంక ప్రారంభించిన ‘అనామలీ’, క్లీన్, వీగన్ ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ కొనుగోలు ద్వారా రిలయన్స్ తన విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్, ‘టిరా’ వంటి ఆమ్నీఛానల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ‘అనామలీ’ని మరింత మంది వినియోగదారులకు చేరువ చేయనుంది.

ఈ ఒప్పందంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ మాట్లాడుతూ, "మా బ్యూటీ బ్రాండ్ల విస్తరణలో ఇది ఒక వ్యూహాత్మక అడుగు. ‘అనామలీ’కి ఉన్న ప్రపంచ స్థాయి గుర్తింపు, అందుబాటు ధరలు దీన్ని మాకు మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ప్రియాంకతో కలిసి పనిచేస్తూ, భారత్‌లో ఈ బ్రాండ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళతాం" అని తెలిపారు.

ఈ డీల్ ప్రకారం ప్రియాంక చోప్రా బ్రాండ్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఈ ఒప్పందంపై ప్రియాంక స్పందిస్తూ, "‘అనామలీ’ ప్రస్థానంలో ఇది ఒక కీలక మలుపు. రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ బ్రాండ్‌ను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి చేరువ చేయగలుగుతాం. ఈషా అంబానీతో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. భారత మార్కెట్‌తో పాటు ఉత్తర అమెరికా, యూకే, మధ్యప్రాచ్యం వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ ‘అనామలీ’ విస్తరణ కొనసాగుతుందని సంస్థ వెల్లడించింది.



Priyanka Chopra
Anomaly
Reliance Retail
Hair Care
Brand

More Telugu News